Thursday, August 20, 2020

సామాజిక పరివర్తనే ఏకైక లక్ష్యంగా

          
         'సాహితీ స్రవంతి' (సంస్థ) సాహిత్య ప్రస్థానం (పత్రిక) జన కవనం (కార్యక్రమం) ఇదొక త్రయం, లేదు త్రిపుటి. 

ఈ త్రిపుటి పుష్కర కాలంగా తెలుగు
సమాజంతో పెనవేసుకుపోయింది. 
సామాజిక పరివర్తన ఏకైక లక్ష్యంగా గురుతర బాధ్యత నిర్వహిస్తున్నది. తెలుగు సాహిత్య పునర్వికసనం పరమ లక్ష్యంగా కృషి చేస్తున్నది. వామపక్ష
భావజాలం ప్రధాన తాత్వికతగా ఉంటూ, ప్రజాస్వభావం గల ఇతర భావజాలాలను గౌరవిస్తూ, విశాల ప్రాతిపదిక మీద ఈ త్రిపుటి నిరంతరం శ్రమిస్తున్నది. సాహితీ స్రవంతి కార్యక్రమాలలో పాల్గొనడం, సాహిత్య ప్రస్థానంలో రచనలు ప్రచురణ కావడం, జనకవనంలో కవులుగా పాల్గొనడం, గౌరవంగా, మర్యాదగానే గాక, గొప్ప బాధ్యతగా సాహితీ పరులు భావిస్తుండడం నిజం. వర్తమాన సమాజ పరివర్తనకు అవసరమైన భావ ప్రచార
నిర్వహణలో ఈ త్రిపుటి పాత్ర తిరుగులేనిది, తిరస్కరించలేనది. ఈ త్రిపుటి ద్వారా ఎందరో ఔత్సాహికులు విమర్శకులుగా, రచయితలుగా వెలుగులోకి వచ్చారు. సామాజిక గౌరవం పొందారు.
        2002 నాటి బషీర్ బాగ్ దుర్ఘటనతో మొదలై రాష్ట్ర స్థాయిలోనూ,జిల్లాల స్థాయిలోనూ అనేక జనకవనం కార్యక్రమాలు జరిగాయి. ప్రతి జనకవనం అప్పటి సామాజిక పరిణామాలకు కళాత్మకమైన కైఫియత్ గా నమోదవుతున్నది.
          లబ్ధ ప్రతిష్ఠులైన కవుల నుండి ఔత్సాహికుల దాకా ఒకే వేదిక పైకి వచ్చి జనం గురించి తమ గళం విప్పడానికి సంకోచించని కార్యక్రమం జనకవనం. 

తెలకపల్లి రవి గారి నిబద్ధత, నిమగ్నతలు ఈ త్రిపుటిని ప్రజాపరం చేస్తున్నాయి. ఆనందాచారి,

వొరప్రసాద్ వంటి సహ సైనికుల ద్వారా ఉద్యమస్థాయిలో సాహిత్య చర్చలు,ప్రచురణలు, కార్యక్రమాల నిర్వహణ సాగుతున్నాయి. ఈ సైన్యంలో భాగస్వామి అనంతపురం జిల్లాలో పిళ్ళా కుమారస్వామి. 
  
           అనంతపురం జిల్లా సాహితీ స్రవంతిని బాధ్యతగా కుమారస్వామి గత పదహైదు ఏండ్లుగా ప్రతి సందర్భంలోనూ కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. ఇతర సాహితీ సంస్థలు స్తబ్ధంగా ఉన్న సమయంలో 

కుమారస్వామి తనదైన మార్గంలో సాహితీ స్రవంతిని ప్రవహింపజేస్తున్నారు. ఆయన కృషిలో భాగమే ఈ 'అనంతసాహితీ స్రవంతి'. అనంతపురం జిల్లా సాహితీ స్రవంతి సుదీర్గ ప్రయాణంలోఇదొక కేంద్ర బిందువు. ఈ దశకు చేరుకోవడానికి 'అనంత' రచయితల, కార్యకర్తల సహకారం మరువలేనిది.

     - (అనంత కవితాస్వరాలు కవితా సంకలనానికి
రాసిన ముందు మాట నుంచి)

  - డా॥ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి

No comments:

Post a Comment