1990 తరువాత సోషలిజం విచ్ఛిన్నంవల్ల చాలా మంది అభ్యుదయ రచయితల్లో, మార్క్సిస్టు రచయితల్లో భవిష్యత్తుపట్ల నిరాశనిస్పృహలు పెరిగాయి. కొంత మంది మాత్రమే భవిష్యత్తు పట్ల అచంచల విశ్వాసం ప్రకటించారు.ప్రపంచ వాణిజ్య సంస్థలో మనదేశ పాలకులు సంతకం పెట్టిరావడంతో ప్రపంచీకరణ ప్రారంభమైంది. నూతన ఆర్థిక విధానాలు పేరుతో ప్రైవేటీకరణ సరళీకరణ ప్రారంభమైంది. విదేశీ పెట్టుబడి ప్రబలంగా మన దేశంలోకి ప్రవహించింది.అదే సందర్భంలో విదేశీ వస్తువులు ఇబ్బడిముబ్బడిగా మనదేశంలోకి ప్రవహించ సాగాయి. పడమటిగాలి విపరీతంగా వీచింది. భాషా సంస్కృతుల్లో పెనుమార్పులు సంభవించి వాటి అస్థిత్వానికి పెనుప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి పేరిటసామాజిక మూలాలు ధ్వంసం అయ్యాయి. మానవసంబంధాలు విచ్ఛిన్నం కాసాగాయి. ఏది గాయమో ఏది గేయమో అర్థంకాని గందరగోళ స్థితిలోసాహిత్యకారులున్నారు.
చరిత్ర అంతమైందని జపాన్ తత్త్వవేత్త ఫుకుయామా ప్రకటించారు.అస్థిత్వవాదమే సరైనదేనే దృక్పథం పెరిగింది. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే,పెట్టుబడిదారి వర్గానికి ఊడిగంచేసే ఆధునికానంతరవాదం సాహిత్యంలోకి చొరబడింది. సమాజంలో వేలవేల చీలికలు వచ్చాయి. దళితుల్లో మాదిగదండోరా, మాలమహానాడు, బహుజనాల్లో తుడుందెబ్బ, చాకిరేవుదెబ్బ, వడ్డెర ... ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘాలు వచ్చాయి. ప్రపంచీకరణలో వ్యాపారీకరణ పెరిగి స్త్రీల అందాన్ని పెట్టుబడిగా మార్చారు. దీనితో స్త్రీవాదం పదును తగ్గిపోయింది. దళిత స్త్రీవాదులుస్త్రీవాద లక్ష్యాన్ని ప్రశ్నించసాగారు. సాహిత్యంలో కవులు, రచయితలు ప్రపంచీకరకణ వెల్లువలో కొట్టుకుపోసాగారు.
ఏది అభివృద్ధి ? ఏది వినాశనమో ? అర్థంకాని అయోమయంలో సాహిత్యకారులు ప్రపంచీకరణ చౌరాస్తాలో నిలబడ్డారు. బషీర్ బాగ్
లో ప్రభుత్వం ప్రజల పైన జరిపిన దారుణ దమణకాండ సాహిత్యకారులను కదిలించింది. అందరినీ ఒక్కటి చేసింది. ప్రపంచీకరణ, ప్రపంచ బ్యాంకుల వాస్తవ స్వరూపం సాక్షాత్కరించింది. ప్రపంచీకరణ ప్రతిఘటన మొదలైంది. 'వికసించిన విద్యుత్తేజం' కవితా సంకలనం వచ్చింది. అదే సందర్భంలో ప్రజలలో ఏర్పడిన నైరాశ్యాన్ని ఆసరాగా తీసుకొని
మతోన్మాద శక్తులు విజృంభించాయి. హిందూ, ముస్లిం మతోన్మాదం రెండూ పెరిగిపోయాయి. 'గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్' అనే పరిస్థితి నెలకొంది. నోస్టాల్జియాలోకి సాహిత్యం వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మతోన్మాదానికి, ప్రపంచీకరణకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసివచ్చే సాహిత్యకారులందరిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు 2001లో 'సాహితీ స్రవంతి' తన ప్రథమ సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలకపల్లి రవి, వరప్రసాద్, లక్ష్మయ్యగార్లతో రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఏర్పడింది. దళిత, స్త్రీవాదులనుకలుపుకు పోవాలని నిర్ణయించింది.
2002లో సాహితీస్రవంతి తన 'సాహిత్య ప్రస్థానం' పత్రికను సాహిత్య కారుల వేదికగా తీసుకువచ్చింది. ఇది త్రైమాసిక పత్రికగా మూడేళ్లు వచ్చింది. తరువాత మాసపత్రికగా నిరంతరాయంగా వస్తోంది. సాహితీ సృజన లోకంలో మంచికదలికను తీసుకువచ్చింది. ప్రగతిశీల సాహిత్యకారుల హృదయాల్లో మంచి సుస్థిర స్థానాన్ని సంపా దించింది. 2001 ముందు
దర్పణం, గమనం, ప్రస్థానం,సాహిత్య సంచికలను తెలకపల్లిరవిగారి సంపాదకత్వాన ప్రజాశక్తి సాహితీసంస్థ తరపున అందించారు. ఈ ఒరవడిలో సాహిత్య ప్రస్థానం పత్రిక అన్ని వర్గాల సాహిత్య కారులకు ముఖ్యంగా కొత్తతరం సాహిత్య సృజన కారులకు మంచి వేదికైంది.
2014లో తెలంగాణా విడిపోవాలనే వాదన బలంగా పెరిగి అంతిమంగా విడిపోయింది. ఆ తరువాత రాయలసీమ అస్థిత్వవేదన ప్రారంభ మైంది.
- పిళ్ళా విజయ్,9490122229
No comments:
Post a Comment