ఒక సాహితీ సమాలోచన... ఒక ప్రస్థానం
వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది...సాహిత్య కార్యక్రమాలను ఒంటరిగా చేయలేము. ఎంతో మంది సాహిత్యకారులు
కలవాలి. సాహిత్యాభిమానులు ఉండాలి. ఒక వసంతం దాటగానే మరో వసంతం వచ్చినట్లు ఒక సాహిత్య కార్యక్రమం చేయగానే మరో సాహిత్య కార్యక్రమం ముందుకు వస్తుంది. బాధ్యతగా ఉన్నప్పుడు సాహిత్యాన్ని ఉద్యమంగా చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా చేస్తాము. సాహితీ పరులకెప్పుడూ అలసట ఉండదు.సాహితీ మిత్రులను ఎప్పుడు ఆహ్వానించినా సభలో కూర్చొని సాహిత్యాన్ని ఆస్వాదిస్తారు.కార్యక్రమమంటేనే కాలాన్ని ఘనీభవింపజేయడం. ప్రసంగమంటేనే భావాలను
ఒకళ్ళ నుంచి మరొకళ్ళలోకి ప్రవహింపచేయడం. పదైదేళ్ళ సాహిత్య ప్రస్థానం గతానికి పొడిగింపే. గతమెంతో ఘనకీర్తి, లేకపోతే ఈ ప్రస్థానం సునాయసంగా సాగేది కాదు. ఎంతో మంది ప్రసిద్ధి సాహితీవేత్తలు - రాచపాళెం, సింగమనేని, శాంతి నారాయణ, రాధేయ, మల్లెల, రాజారాం ఇలా ఎంతో మంది జిల్లాలో వున్న సాహితీమూర్తులు సాహితీ స్రవంతికి చేదోడువాదోడుగా, వెన్నుదన్నుగా నిలబడ్డారు. సాహిత్య ప్రస్థానం పత్రికకు చందాదారులుగా, రచయితలుగా ఎంతోసహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నారు.
కొత్త గొంతుకను పరిచయం చేయటానికి నిరంతరం సాహితీస్రవంతి శ్రమిస్తోంది. పాతతరం సాహిత్యకారులను పరిచయం చేస్తూ కొత్త కలాలకు, గళాలకు ఊతమిస్తూ సాగుతోంది సాహితీ స్రవంతి. అనంతపురం జిల్లాలో సాహితీస్రవంతి ఇప్పటికే రెండు రచనలను
ప్రచురించింది. ఒకటి పిళ్ళా కుమార స్వామి రచించిన 'ప్రపంచీకరణపై పోటెత్తిన కవితా
సముద్రం' రెండు 'అనంతకవితా స్వరాలు', ఇప్పుడు 'అనంత సాహితీసమాలోచన'. ఇంకా
మరెన్నో రచనలు వర్థమాన సాహిత్యకారుల నుంచి రావాలి.అలా రావాలంటే ఈ సాహిత్య కృషి నిరంతరం కొనసాగాలి.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నాము. జిల్లాలో సాహితీస్రవంతి పదహైదేండ్ల ప్రస్తానాన్ని అక్షరీకరించి పుస్తకరూపంలో మీ ముందుంచాము. దీనిని సాదరంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాము.
ఇదొక సంఘటిత స్వరం. అక్షరాల మాలిక, వ్యాస మంజరి, సాహితీ పూదోట. దీనిలోకి తొంగిచూసి ఒకరినొకరు కరచాలనం చేసుకొన్నప్పుడు ప్రతి స్వరంలోనూ మన హృదయస్పందనలు ఒకళ్ళ నుంచి మరొకళ్ళలోకి ప్రవహించేలా....
పిళ్ళా కుమారస్వామి,
సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు
No comments:
Post a Comment